కడపలో కిక్కిరిసిన యువగళం పాదయాత్ర దారిపొడవునా యువనేతకు జన నీరాజనాలు అడుగడుగునా హారతులు, వినతుల వెల్లువ
నేడు మిషన్ రాయలసీమపై ప్రముఖులతో ముఖాముఖి
కడప: ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప గడ్డపై యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా జన ప్రభంభజనం పెల్లుబికింది. 118వరోజు యువగళం పాదయాత్ర కడప పుత్తా ఎస్టేట్ నుంచి ప్రారంభం కాగా, యువగళం పాదయాత్ర పొడవునా జనం పోటెత్తారు. యువనేత కోసం కడప ప్రజలు రోడ్లవెంట బారులు తీరడంతో కడప నగరం కిక్కిరిసిపోయింది. కడపలో యువనేత నారా లోకేష్ జనం నీరాజనాలు పట్టారు. పాదయాత్ర ప్రారంభంలో యువనేతకు ఆపిల్ పండ్లతో తయారుచేసి గజమాలను వేసి ఘనంగా సత్కరించారు. దారిపొడవునా యువనేతకు హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి యువనేతకు అభివాదం చేశారు. వివిధ వర్గాల ప్రజలు లోకేష్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి పోటీపడ్డారు. అందరి సమస్యలు ఓపికగా విని అధికారంలోకి వచ్చిన తరువాత అందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. దారిపొడవునా మహిళలు, నిరుద్యోగులు, వ్యాపారులు, ముస్లింలు, భవన నిర్మాణ కార్మికులు, బ్రాహ్మణులు, నగరంలోని వివిధ డివిజన్ల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 118వరోజు యువనేత లోకేష్ 7.4 కి.మీ దూరం నడిచారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1516.8 కి.మీ. మేర పూర్తయింది. ఇదిలావుండగా బుధవారం సాయంత్రం కడప రాజరాజేశ్వరి కళ్యాణమండపం ఎదుట ప్రాంగణంలో రాయలసీమ ప్రముఖులతో యువనేత లోకేష్ మిషన్ రాయలసీమ పేరుతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో టిడిపి అధికారంలోకి వచ్చాక రాయలసీమలో చేపట్టబోయే పనులపై యువనేత లోకేష్ కీలక ప్రకటన చేయనున్నారు. ఉమ్మడి రాయలసీమకు చెందిన ప్రముఖులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
తెలుగుదేశం కుటుంబం..ఆదుకునే అనుబంధం!
తెలుగుదేశం పార్టీలో కార్యకర్త నుంచి కార్యదర్శి వరకూ ఒక కుటుంబంగా భావిస్తారు. అభిమాని నుంచి అధ్యక్షుడి వరకూ కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ సాయం అందిస్తారు. ఇటీవల కడప పార్లమెంట్ ఐటిడిపి ప్రధాన కార్యదర్శి నరసింహ చనిపోగా, వారి కుటుంబాన్ని టిడిపి ఆదుకుంది. తమకి అండగా నిలిచిన టిడిపి ఆశాకిరణం నారా లోకేష్ ని పాదయాత్రలో కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది నరసింహ కుటుంబం. ఐటిడిపి 2 లక్షలు, స్థానిక నాయకులు 2 లక్షలు, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు 5 లక్షలు కలిపి మొత్తం 9 లక్షలు సాయంగా అందించారు. నరసింహ భార్యకి ఉద్యోగం, కూతురిని చదివించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను కుటుంబసభ్యుల్లా భావించి ఆదుకోవడం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమని మరోసారి నిరూపించారు.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
కరెంటు బిల్లు ఎక్కువైందని పెన్షన్ తీసేశారు -పెంచలమ్మ, చిన్నచౌక్ రోడ్, కడప
గత ప్రభుత్వంలో నాకు నా భర్తకి ఇద్దరికీ పెన్షన్ వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా భర్తకు ఇచ్చి నాకు తొలగించారు. గత ఏడాది నా భర్త కూడా పెన్షన్ తొలగించారు. ఎందుకు తొలగించారని అడిగితే విద్యుత్ 400 యూనిట్లుపైన విద్యుత్ వాడుతున్నారని చెప్పారు. మాకు ఉన్న చిన్న రెండో రూమ్ రూ.1,000లకు స్టూడెంట్స్ కి రెంటుకు ఇచ్చాము. రెండు రూముల కలిపి ఒకటే మీటర్ ఉంటుంది. ఆ 4 00 యూనిట్లు కూడా ఎండాకాలంలోనే వస్తుంది.. మిగతాకాలంలో 250 యూనిట్లకు మించి రాదు. మా కొడుకు కోడలు కూడా మాతో ఉండరు వారు వేరుగా కాపురం పెట్టుకున్నారు.
చెత్తపన్నుతో నడ్డి విరుస్తున్నారు -చిన్న రాములు. ఫాస్ట్ ఫుడ్ నిర్వహకురాలు
ఎనిమిది ఏళ్లుగా ఫాస్ట్ ఫుడ్ జ్యూస్ పాయింట్ నడుపుకుంటున్నా. రోజు మొత్తం మీద మాకు రెండు కేజీలు చెత్త కూడా ఉండదు. కానీ మెయిన్ రోడ్ లో ఉన్నామని నెలకు రూ.120 వసూలు చేస్తున్నారు. నెలకు నాలుగు గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తాం.. అందులో ఒకటి మాత్రమే రాయితీ మీద వస్తుంది.. మిగతా మూడు కమర్షియల్ సిలిండర్ల రూపంలో కొనుగోలు చేయాల్సి వస్తుంది. విద్యుత్ బిల్లు కూడా విపరీతంగా వస్తోంది. గత ఏడాదికి.. ఇప్పటికి వసూలు చేస్తున్న విద్యుత్ బిల్లులకు చాలా తేడా ఉంది.
పంటల బీమా రాలేదు -తాటిమాకుల సిద్ధారెడ్డి, పెండ్లిమర్రి
గత జూన్ లో ఐదు ఎకరాలు వరి నాటాను. కొప్పునూర్చటానికి అన్ని కోసి ఓదెలు పెట్టాను. కానీ వర్షం వచ్చి మొత్తం తడిసిపోయింది. ఎకరాకు 25 బస్తాలు అయినప్పటికీ.. ధాన్యం తడవడం వల్ల తక్కువ రేటుకు కొన్నారు. పోయిన మార్చి కూడా ఐదు ఎకరాలు నాటాను. అకాల వర్షాల వల్ల ఆ పంట కూడా దెబ్బతిన్నది. ఎకరాకు ఐదు బస్తాలు మాత్రమే అయింది. బీమా పరిహారం కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. మందుల రేట్లు విపరీతంగా పెరిగాయి.
వైసిపికి ఓటేయాలని బెదిరించారు -సింగం నాగరాజు, కడప టౌన్.
నా భార్య పారిశుద్ధ్య కార్మికురాలుగా అవుట్ సోర్సింగ్ పనిచేసేది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగంలో ఉండాలంటే వైసీపీకి ఓటు వేయాలని కార్మికులందరినీ బెదిరించారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు బెంగళూరు వలస వెళ్లాము. ముఖ్యమంత్రి సామాజికవర్గం ఏం చెప్తే ఇక్కడ అదే వేదం.
అపోహలు వీడండి… రెడ్డిసోదరులకు అండగా ఉంటాం అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులు తీసేస్తాం టిడిపిలోనే రెడ్లకు సముచితమైన గౌరవ మర్యాదలు రెడ్డి సామాజికవర్గీయులతో యువనేత నారా లోకేష్
కడప: నేను పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత ఎదురైన సమస్యలు చూశాక జగన్ పాలనలో ఎక్కువ నష్టపోయింది రెడ్డి సోదరులేనని తెలిసిందని, జగన్ చేతిలో రెడ్డి సామాజికవర్గం బాధితులుగా మారారని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కడప పుత్తా ఎస్టేట్స్ లో రెడ్డి సామాజికవర్గీయులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… జగన్ పాలనలో కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు. సజ్జల, సాయిరెడ్డి, పాపాల పెద్ది రెడ్డి, సుబ్బా రెడ్డి కి తప్ప ఏ ఇతర కుటుంబానికి న్యాయం జరగలేదు. రెడ్డి సోదరులు మొదటి నుండి తెలుగుదేశం కి అండగా నిలిచారు. జగన్ పాలనలో రెడ్లకు కనీస గౌరవం దక్కడం లేదు. తెలుగుదేశం పార్టీ మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చింది. 2014 నుండి 19 వరకూ రెడ్లకు ముఖ్య పదవులు ఇచ్చాం. జగన్ కొన్ని అపోహలు కల్పించాడు. నిజం ఇంటి గడప దాటే ముందు అబద్దం ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. జగన్ చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మి రెడ్డి సోదరులు మోసపోయారు.
జగన్ పాలనలో రెడ్డి సోదరుల ఆత్మహత్యలు
జగన్ పాలనలో రెడ్డి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిన్నే టిడిపి నాయకుడు జయరాం రెడ్డి పై వైసిపి నాయకులు దాడి చేశారు. పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ల లో ఉన్న పేదలను ఆదుకుంటాం. రెడ్డి భవనం ఏర్పాటు కు సహకరిస్తాం. పెండింగ్ బిల్లులు అన్ని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తాం. కాంట్రాక్టర్లు అధైర్య పడొద్దు. పాదయాత్ర లో రాయలసీమ రైతుల కష్టాలు నేను చూసాను. రాయలసీమ ను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. దానిమ్మ, అరటి, బొప్పాయి, మామిడి, కర్జూరం తదితర పంటలు వేసేలా అధిక ప్రోత్సాహం ఇస్తాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పంటలు వెయ్యాలి, అందులో కొత్త రకాలు తీసుకొచ్చేందుకు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గతంలో లాగానే 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తాం. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తాం.
వ్యవసాయానికి పాత బీమా పథకం అమలుచేస్తాం
రాయలసీమ రైతులకు సరైన ప్రోత్సాహం ఇస్తే బంగారం పండిస్తారు. వ్యవసాయానికి పాత భీమా పథకాన్ని అమలు చేస్తాం. జగన్ పాలనలో రెడ్ల పైనే వేధింపులు ఎక్కువ అయ్యాయి. రెడ్ల ఆస్తుల పై దాడులు చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులు అన్ని తొలగిస్తాం. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. నా వ్యక్తిగత సిబ్బంది లో కూడా రెడ్లు ఉన్నారు. నేను నమ్మే వాస్తు సిద్ధాంతి జయరాం రెడ్డి. రెడ్డి సోదరులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. రాంగోపాల్ రెడ్డి కి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గెలిపించుకున్నాం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం టిడిపి లో మాత్రమే రెడ్లకు గౌరవం దక్కుతుంది. పరిపాలన ఒకే చోట…అభివృద్ది వికేంద్రీకరణ టిడిపి నినాదం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్యాక్షన్ బాధితులకు సాయం
ఫ్యాక్షన్ లో ఇబ్బంది పడిన కుటుంబాలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నాం. మీ తమ్ముడు పిల్లల్ని చదివించే బాధ్యత నాది అంటూ రామచంద్రా రెడ్డి కి భరోసా ఇచ్చిన లోకేష్. మీ తమ్ముడ్ని చంపిన వారిని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రెడ్డి కార్పొరేషన్ పెట్టడమే తప్ప జగన్ ఒక్క రూపాయి కేటాయించలేదు. టిడిపి వచ్చిన వెంటనే రెడ్ల లో ఉన్న పేదలకు సాయం చేస్తాం. రైతులకు కులం ఉండదు. ఇప్పుడు రైతుల్లో కూడా జగన్ ప్రభుత్వం కులం చూస్తుంది. మోటార్ల మీటర్లు పెట్టి రైతులను వైసిపి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత టిడిపి ది. విద్యా దీవెన, వసతి దీవెన అంత చెత్త కార్యక్రమం మరొకటి లేదు. ఫీజులు సకాలంలో చెల్లించక యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు జగన్ పాలన వలన సర్టిఫికేట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికేట్లు అందజేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పీజీ ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభిస్తాం. మునమ్మ కుమారుడిని ప్రత్యర్థులు చంపేస్తే పిల్లల్ని టిడిపి చదివించింది. అది రెడ్ల పట్ల టిడిపి కి ఉన్న చిత్తశుద్ది.
ముఖాముఖి సమావేశంలో రెడ్డి సామాజికవర్గీయుల అభిప్రాయాలు:
ముఖాముఖి సమావేశంలో పలువురు రెడ్డి సామాజికవర్గ ప్రతినిధులు తమ మనోభావాలను వెల్లడించారు. బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ…రెడ్లలో ఉన్న పేదలను ఆదుకోవాలి. ఏపిలో రెడ్డి భవనం ఏర్పాటు కు సహాయం చెయ్యాలని కోరారు. రవి శంకర్ రెడ్డి మాట్లాడుతూ…కాంట్రాక్టులు చేసి నష్టపోయాం. జగన్ పాలనలో పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. అంకి రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ లో రెడ్లు ఎక్కువుగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఎటువంటి సాయం అందడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం లేదని తెలిపారు. నాగ భూషణ్ రెడ్డి మాట్లాడుతూ… జగన్ మొదట కూల్చిన ఇళ్లు నాదే. ఇంట్లో 80 లక్షల రూపాయల సామాన్లు కూడా దొచుకుపోయారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఎంత ఇబ్బంది పెట్టినా పోరాడతానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు తొలగించాలని కోరారు. ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… చదువుకున్న రెడ్డి యువతకు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ… జగన్ సిఎం అయిన వెంటనే నా తమ్ముడ్ని మర్డర్ చేశారు. ఇప్పటి వరకూ నాకు న్యాయం జరగలేదు. పైగా వ్యక్తిగత కక్షలు అని ముద్ర వేశారని అన్నారు. పాపిరెడ్డి మాట్లాడుతూ… జగన్ అనేక హామీలు ఇచ్చాడు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను. రైతులను కార్పొరేషన్ ద్వారా ఆదుకుంటాం అని హామీ ఇచ్చాడు. ఒక్క రూపాయి సాయం చెయ్యలేదన్నాడు. మునమ్మ మాట్లాడుతూ… నా కొడుకుని హత్య చేశారు. నా ఆస్తి లాక్కున్నారు. వైసిపి నాయకులు వేధిస్తున్నారని ఆవేదన చెందింది. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.
యువనేతను కలిసిన మీ సేవ కాంట్రాక్ట్ ఉద్యోగులు
కడప రామకృష్ణ కాలేజి వద్ద అర్బన్ మీ సేవ ఉద్యోగులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించేందుకు 2003లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సేవ వ్యవస్థను ఏర్పాటుచేశారు. కాలక్రమేణా ముఖ్యమంత్రులు మారినా దీనిని మీ సేవగా మార్పుచేసి విజయవంతంగా నడిపారే తప్ప ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అధికారంలోకి వచ్చాక మీ-సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుంటూ, మీ-సేవల్లో పనిచేసే సిబ్బందిని మాత్రం రోడ్డున పడేశారు. మీ సేవ కాంట్రాక్ట్ సిబ్బందికి దాదాపు 12నెలలుగా జీతాలు ఇవ్వకపోగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 171 గవర్నమెంట్ అర్బన్ మీ సేవ కేంద్రాలను ఎటువంటి నోటీసు లేకుండానే స్వాధీనం చేసుకొని మాకు తీవ్ర అన్యాయం చేశారు. మీ-సేవల్లో తమకున్న 17సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మా సేవలను ఉపయోగించుకోవాలని మూడేళ్లుగా మంత్రులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు. మానవతా దృక్పథంతో అర్బన్ మీ సేవ ఉద్యోగులకు న్యాయం చేయాల్స్సిందిగా విజ్ఞప్తి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
మాటతప్పి మడమతిప్పడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో 2014కు ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన కాంట్రాక్టర్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని కొత్త డ్రామా మొదలుపెట్టారు. గత ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానన్న దారుణంగా మోసగించారు. ప్రజలకు మెరుగైన పౌరసేవలందించేందుకు ఉద్దేశించిన మీ సేవ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే అర్బన్ మీ సేవ ఉద్యోగుల సేవలను గతంలో మాదిరి మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. తమ న్యాయమైన డిమాండ్లతో అర్బన్ మీ సేవ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు టిడిపి మద్దతు ఇస్తుంది.
యువనేతను కలిసిన బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు
కడప మాసియా సర్కిల్ లో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. TDP పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేశారు. బ్రాహ్మణ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రాహ్మణుల స్థితిగతులు రోజురోజుకు అధ్వానంగా తయారవుతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ ను పునరుద్ధరించి, పథకాలు అమలు చేయాలి. బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. స్వయం ఉపాధి పథకాల ద్వారా బ్రాహ్మణ స్వయం ఉపాధికి సహకరించాలి. విదేశీవిద్య రుణాలు పునరుద్ధరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ..
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి అన్నివర్గాలను దారుణంగా మోసగించారు. గత టిడిపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.282 కోట్లతో 1,54,182 మంది బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చాం. “వేదవ్యాస” పథకం ద్వారా వేద విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ వేద విద్యాలయాలలో ఫుల్ టైం కోర్సు గా వేదాలు, స్మార్తం అభ్యసిస్తున్న పేద బ్రాహ్మణ విద్యార్థులకు రూ.21.60 లక్షల లబ్ది చేకూర్చడం జరిగింది. పురోహితులు, అర్చకులు, వేదపండితుల కుమార్తెలకు “కళ్యాణమస్తు” పథకం ద్వారా రూ.75 వేలను కానుకగా అందించాం. “గాయత్రి” విద్యా పథకం ద్వారా, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల అనే విచక్షణ లేకుండా అత్యుత్తమ ప్రతిభ కనపరచిన 761 మంది విద్యార్ధులకు రూ.76 లక్షలను ప్రోత్సాహకంగా అందించాం. బ్రాహ్మణుల సంక్షేమం, స్వావలంబన కోసం రూ.50 కోట్లతో సీడ్ కాపిటల్ లో ప్రత్యేకంగా ఒక సహకార పరపతి సంఘం ఏర్పాటు చేశాం. టిడిపి అధికారంలోకి రాగానే గతంలో బ్రాహ్మణులకు అందజేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం. పేద బ్రాహ్మణులకు ఇళ్లస్థలాలు, ఇళ్లు కేటాయిస్తాం. విదేశీవిద్య పథకాన్ని పునరుద్దరించి ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం కల్పిస్తాం.
యువనేతను కలిసిన ముస్లిం సామాజికవర్గీయులు
కడప రెండవ గాంధీ విగ్రహం వద్ద ముస్లిం సామాజికవర్గీయులు యువనేతను లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ పాలనలో మైనారిటీలు పూర్తిగా మోసపోయారు. గత ప్రభుత్వంలో మైనారిటీలకు అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. టీడీపీ హయాంలో రూ.27కోట్లతో హజ్ హౌస్ నిర్మిస్తే, దానిని నాలుగేళ్లుగా పాడుబెట్టారు. రఖీబ్ షా వలీ దర్గా ఆస్తులను బలవంతంగా కబ్జా చేశారు. దండు ఈద్గా వద్దనున్న చారిత్రాత్మక శ్మశాన స్థలాన్ని ఇతరులకు కట్టబెట్టారు. కడప నడిబొడ్డున 4 శతాబ్ధాలుగా ఉన్న దర్గా వద్ద దౌర్జన్యంగా మరుగుదొడ్లు నిర్మించారు. గుర్రాలగడ్డ-రవీంద్రనగర్ ను అనుసంధానం చేసే బుగ్గవంక బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపేశారు. వక్ఫ్ బోర్డు స్థలాలకు రక్షణ కరువైంది. ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలు నిలిపేశారు. మైనారిటీలకు విదేశీవిద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మైనారిటీల సమస్యల్ని పరిష్కరించాలి. మైనారిటీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
జగన్మోహన్ రెడ్డి పాలనలో మైనారిటీల మానప్రాణాలతో పాటు ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వేలకోట్ల రూపాయల మైనారిటీల ఆస్తులను వైసిపినేతలు కబ్జా చేశారు. నర్సరావుపేటలో మసీదు ఆస్తులను కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను వైసిపి గూండాలు దారుణంగా నరికి చంపారు. మైనారిటీలపై ఇదివరకెన్నడూ లేనివిధంగా అఘాయిత్యాలు జరుగుతున్నా కడపకు చెందిన మైనారిటీ మంత్రి నోరు మెదపడం లేదు. గత నాలుగేళ్లలో రూ.5,355 కోట్ల సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నేతలు కబ్జా చేసి వక్ఫ్ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తాం. మైనారిటీల కోసం గతంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. దామాషా పద్ధతిన మైనారిటీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన కడప యూత్ సొసైటీ ప్రతినిధులు
కడప చెన్నూరు బస్టాండు వద్ద యూత్ సొసైటీ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కడప జిల్లా యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతను ఆదుకోవాలి. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి రూ.5వేలు ఇప్పించాలి. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు స్కాలర్ షిప్ లు సకాలంలో అందడం లేదు. ఉన్నత విద్యకు ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని కొనసాగించాలి. విదేశీవిద్య నిబంధనలను సరళతరం చేసి ఎక్కువమందికి అవకాశం కల్పించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా కడప జిల్లా యువతకు తీరని ద్రోహం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కు రెండుసార్లు శిలాఫలకాలు వేసిన జగన్… ఆ పనులను అడుగు కూడా ముందుకు కదల్చలేదు. అధికారంలోకి వచ్చాక ఒక్క జాబ్ క్యాలండర్ గానీ, ఉద్యోగం కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి జె-ట్యాక్స్ వేధింపుల కారణంగా రాష్ట్రంలోని పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని వేగవంతం చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. చంద్రబాబునాయుడు మహానాడులో ప్రకటించిన విధంగా పెద్దఎత్తున పరిశ్రమలను రప్పించి ప్రైవేటురంగంలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగం వచ్చేవరకు ప్రతినిరుద్యోగికి రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం. జిఓ నెం.77ని రద్దుచేసి పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్దరిస్తాం. విదేశీవిద్యకు అనవసరమైన నిబంధనలను తొలగించి గతంలో మాదిరిగా పెద్దఎత్తున పేదవిద్యార్థులకు అవకాశం కల్పిస్తాం.
లోకేష్ ను కలిసిన ఆర్యవైశ్య సామాజిక వర్గీయులు
కడప గోకుల్ సర్కిల్ లో ఆర్యవైశ్య సామాజికవర్గ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్యవైశ్యుల్లో చాలా మంది నిరుపేదలున్నారు. వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. అర్హత ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.వ్యాపార సముదాయాలకు పెట్టే బోర్డులపై మోయలేనివిధంగా పన్నులు వేస్తున్నారు. గతంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్య కార్పోరేషన్ ను నిర్వీర్యం చేశారు. కడప పట్టణంలో ఎలాంటి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు లేక యువతకు ఉపాధి దొరకడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ..
వైసిపి అధికారంలోకి వచ్చాక అమలుచేస్తున్న జె-ట్యాక్స్ విధానాల కారణంగా ఆర్యవైశ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రకరకాల పన్నులతో వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన వ్యాపార ప్రముఖులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు బనాయించి జైలులో పెట్టారు. నంద్యాల మండీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువీధి వెంకటసుబ్బయ్య కిరాతకంగా చంపిన రౌడీలు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులు స్వేచ్చగా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తాం. అనవసరమైన పన్నుల భారాన్ని తగ్గించి వ్యాపారాలను ప్రోత్సహిస్తాం. అర్హులైన పేదవ్యాపారులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, చిరువ్యాపారులకు సబ్సిడీరుణాలు అందజేస్తాం. ఆర్యవైశ్యులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం.
యువనేత లోకేష్ ను కలిసిన నిరుద్యోగులు
కడప కృష్ణదేవరాయ సర్కిల్ లో నిరుద్యోగ యువకులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ పాలనలో గ్రూపు, పోలీస్, టీచర్ ఉద్యోగాలు పెద్దఎత్తున భర్తీ చేశారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ఉచిత కోచింగ్ ఇప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇవేమీ కనిపించడం లేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 25లక్షల యువతను మోసం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కు రెండు సార్లు శంకుస్థాపన చేసి కలగానే మిగిల్చారు. మీరు అధికారంలోకి వచ్చాక యువతను ఆదుకోవాలి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాం.
నారా లోకేష్ స్పందిస్తూ…
ఎన్నికల సమయంలో ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, 2.3లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి మోసగించారు. జగన్ నిర్వాకం కారణంగా తీవ్ర నిరాశ,నిస్పృహలకు గురైన 470మంది యువతీయువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగ యువతను గంజాయి, మత్తుపదార్థాలకు బానిసలుగా మార్చి, వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ప్రతిఏటా ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. యువగళం పథకం కింద నిరుద్యోగ యువతకు రూ.3వేల రూపాయల భృతి కల్పిస్తాం. ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున పరిశ్రమలను రప్పించి 20లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. గతంలో మాదిరిగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు, స్టడీసర్కిళ్లు ఏర్పాటుచేస్తాం. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టి కడప జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. మీకోసం పనిచేసే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీవంతు సహకారం అందించండి.
యువనేతను కలిసిన కడప శంకరాపురం వాసులు
కడప నగరం శంకరాపురం వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా డివిజన్ లో యూజీడీ పనులు 16ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో అన్ని సందుల్లో మురుగునీరు పారుతోంది. సీసీరోడ్లు పూర్తిస్థాయిలో నిర్మించలేదు. డివిజన్ లో తరచుగా కరెంటు కోతలున్నాయి. కాలంతో సంబంధం లేకుండా మంచినీరు రెండు రోజులకు ఒకసారి వస్తున్నాయి. వీధిలైట్ల నిర్వహణ సరిగా లేదు. మా డివిజన్ లో మురుగునీటి వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై లేదు. జగన్ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యంగా మారాయి. కడపవంటి ప్రముఖ నగరాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా కార్పొరేషన్ వద్ద నిధుల్లేవు. టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ. సిసి రోడ్లు, 30లక్షల ఎల్ ఇడి లైట్లు వేశాం. మళ్లీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కడప నగరంలో సిసి రోడ్లు, మెరుగైన డ్రైనేజి వ్యవస్థ, ఎల్ ఇడి వీధిదీపాలు ఏర్పాటు చేస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందజేస్తాం. అడ్డగోలు పన్నుల విధానాన్ని సమీక్షించి, అనవసరమైన పన్నులు తొలగిస్తాం.
యువనేత లోకేష్ ను కలిసిన భవన నిర్మాణ కార్మికులు
కడప అప్సర సర్కిల్ లో భవననిర్మాణ కార్మకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై చర్చించుకోవడానికి స్థలం కేటాయించి, కమ్యునిటీ హాలు నిర్మించాలి. భవన నిర్మాణ కార్మికులకు గృహ వసతి కల్పించి ప్రత్యేక కాలనీలు నిర్మించాలి. గుర్తింపు పొంది, 60ఏళ్లు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికునికి నెలకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలి. గుర్తింపుకార్డు పొందిన కార్మికునికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.10లక్షలు ఆర్థిక సాయం చేయాలి. పనిప్రదేశంలో ప్రమాదానికి గురై అంగవైకల్యం ఏర్పడిన కార్మికునికి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించాలి. పని ప్రదేశంలో మరణించిన గుర్తింపు లేని కార్మికునికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. ఇసుక, కంకర, రాయి, గ్రానైట్, మట్టికి రాయల్టీ తగ్గించాలని కోరుతున్నాం. ఇసుకను అందుబాటులోకి తెచ్చి భవన నిర్మాణ కార్మికులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలి. కడప నగరంలో భవన నిర్మాణ కార్మికులు, పేదల కోసం అన్న క్యాంటీన్లను ప్రారంభించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహం భవన నిర్మాణ కార్మికులకు శాపంగా మారింది. స్థానికంగా లభించే ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండటంతో ఇసుక అందుబాటులో లేక నిర్మాణపనులు ఆగిపోవడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ఇసుక మాఫియా గత నాలుగేళ్లుగా రూ.10వేల కోట్లు దోచుకుంది. 40లక్షలమంది భవన నిర్మాణ కార్మికులను రక్తమాంసాలను ఫణంగా పెట్టి జగన్ అక్రమ సంపాదనకు తెరలేపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వెంటనే ఇసుక విధానాన్ని సరళీకరించి ఇసుకను అందుబాటులోకి తెస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని పునరుద్దరించి, ఆర్థిక సాయాన్ని అందిస్తాం. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్దరించి భవన నిర్మాణ కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తాం. అన్నాక్యాంటీన్లను ఏర్పాటుచేసి కార్మికులు, పేదల ఆకలి తీరుస్తాం.
యువనేతను కలిసిన కడప కొండయ్యపల్లి వాసులు
కడప ఎన్టీఆర్ సర్కిల్ సర్కిల్ లో కొండయ్యపల్లికి చెందిన ప్రముఖులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 6వ డివిజన్ లో కేసీ కెనాల్ పై అక్రమ కట్టడాలను అరికట్టి రోడ్డును విస్తరించాలి.డ్రైనేజీ సమస్య అత్యధికంగా ఉంది, పరిష్కరించాలి. మా డివిజన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేదలకు అన్న క్యాంటీన్ నిర్మించాలి. మా ప్రాంతంలో అర్హులకు పెన్షన్లు రావడం లేదు. మీకు అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలి. ఓల్డేజ్ హోమ్ నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక వైసిపి నాయకులు అడ్డగోలు కబ్జా పర్వానికి తెరలేపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కడప నగరంలో బుగ్గవంకను ఆక్రమించి థియేటర్ నిర్మించారు. వైసిపి అధికారంలోకి వచ్చాక కుంటిసాకులతో రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల పెన్షన్లను తొలగించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కడప నగరంలో డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం. కడపలో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తాం. లక్షలాదిమంది పేదల ఆకలితీర్చిన అన్నా క్యాంటీన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన కడప చిన్నచౌక్ ప్రజలు
కడప చిన్నచౌక ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కడప చిన్నచౌక్ ఏరియాలో మేం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వర్షాకాలంలో నీరు ఇళ్లల్లోకి ఆరు అడుగుల ఎత్తుకు వస్తున్నాయి. ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోతున్నాయి. 20ఏళ్లుగా ఈ సమస్యతో మేం సతమతమవుతున్నాం. మా ప్రాంతంలో రోడ్లు మొత్తం గుంతలమయమయ్యాయి, డ్రైనేజీ, మురుగు కాలువలు లేవు. మా ప్రాంతంలో ప్రాథమిక వైద్యశాల కూడా లేదు. తిలక్ నగర్, రామకృష్ణనగర్, బీడీకాలనీ, రామాంజనేయపురం, శాంతినగర్, ప్రకాష్ నగర్ లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. 2వ డివిజన్ లోని మైనింగ్ మట్టిని కొంతమంది అక్రమంగా అమ్ముకుంటున్నారు. మట్టి రవాణా వల్ల 2వ డివిజన్ లోని నానాపల్లె, వైఎస్ఆర్ లే అవుట్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లు, స్థానిక సంస్థలను పూర్తిగా గాలికొదిలేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కేంద్రంలో వర్షానికి ఇళ్లు మునిగిపోవడం సిగ్గుచేటు. అధికారపార్టీ నేతలు మట్టి, ఇసుక అక్రమ తవ్వకాల్లో మునిగిపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చాక మెరుగైన డ్రైనేజి వ్యవస్థ, రోడ్లు నిర్మించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. అక్రమ ఇసుక, మట్టి రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. అన్నక్యాంటీన్లను పునరుద్దరించి పేదలు, రోజువారీ కూలీల ఆకలి తీరుస్తాం.
Also Read This Blog: Celebrating Youth Empowerment: The Yuvagalam Padayatra Movement
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh