Nara Lokesh padayatra,yuvagalam

మైదుకూరు నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం యువకుల కేరింతలనడుమ యువనేతకు అపూర్వస్వాగతం దారిపొడవునా మహిళల నీరాజనాలు, వినతుల వెల్లువ

మైదుకూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 114వరోజు మైదుకూరు నియోజకవర్గంలో హోరెత్తింది. యువతీయువకుల కేరింతల నడుమ అడుగడుగునా యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. దారిపొడవునా మహిళలు యువనేతకు హారతులుపట్టి నీరాజనాలు పలికారు. యువనేతను చూసేందుకు జనం రోడ్లవెంట బారులు తీరారు. వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున యువనేతకు ఎదురేగి తమ సమస్యలను విన్నవించారు. కొత్తపల్లి పిఎన్ఆర్ ఎస్టేట్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర నాగులపల్లి క్రాస్ వద్ద మైదుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మైదుకూరు నియోజకవర్గ ఇన్ చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలో పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతకు ఎదురేగి స్వాగతం పలికారు. దారిపొడవునా

 వివిధ గ్రామాల ప్రజలు, దళితులు, రైతులు యువనేత వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. కొత్తపల్లి క్యాంప్ సైట్ లో వివిధవర్గాల ప్రముఖులతో యువనేత లోకేష్ సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు. అనంతరం కొత్తపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఖాదర్ పల్లి, చాపాడు, సీతారాంపురం, చియ్యపాడు క్రాస్, కేతవరం క్రాస్ మీదుగా విశ్వనాథపురం క్యాంప్ సైట్ కు చేరుకుంది. 114వరోజు యువనేత లోకేష్ 13.8 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1470.4 కి.మీ.మేర పూర్తయింది. 115వరోజు పాదయాత్ర పూర్తిగా మైదుకూరు పట్టణంలో కొనసాగనుంది. శనివారం సాయంత్రం మైదుకూరు రాయలకూడలిలో నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగిస్తారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

నీళ్లివ్వద్దని నేతలు బెదిరించారు -రాజోలి బైపురెడ్డి, చాపాడు

నాకు 1.75 ఎకరాల పొలం ఉంది.  ఆ పొలానికి పక్కనున్న వాళ్ల నుండి నీళ్లు తీసుకుంటా. అందుకు గాను యేటా 3 మూటలు వడ్లు ఇచ్చే వాన్ని. కానీ మాకు నీళ్లు ఇచ్చే వ్యక్తిని మా గ్రామంలోని వైసీపీ నేతలు నీళ్లు ఇవ్వవద్దని బెదిరించారు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు ఇవ్వడం మానేశారు. దీంతో పసుపు పంట, నువ్వుల పంట ఎండిపోయింది. రూ.65 వేల పెట్టుబడి, మా కష్టమంతా మట్టిలో పోసిన పన్నీరైంది. మా గ్రామంలో ఎంపీటీసీగా బీసీలకు అవకాశం వస్తే..నిలబెట్టాం..దానిపై కోసంతో నాకు నీళ్లు ఇవ్వకుండా చేశారు.

రుణం తీసుకున్నానని రేషన్ కార్డు కట్ చేశారు -బంకా రామ్మోహన్ రెడ్డి, ప్రొద్దుటూరు

నేను బట్టలకొట్టు పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకులో రూ.5 లక్షల రుణం తీసుకున్నా. రుణం ఇవ్వడానికి ఇన్ కం ట్యాక్స్ పే చేస్తున్నట్లు చూపించాలని బ్యాంకు అధికారులు అడిగితే వెయ్యి రూపాయలు చెల్లించినట్లు డాక్యుమెంట్లలో పొందు పరిచా. దీంతో రేషన్ కార్డును తొలగించారు. కానీ తర్వాత నష్టాలు వచ్చి బట్టల షాపు కూడా తీసేశాను. మళ్లీ రేషన్ కార్డుకు అప్లై చేశా..అయినా ఇవ్వలేదు. మా అమ్మకు ప్రత్యేక రేషన్ కార్డు ఉంది..నాలుగేళ్లుగా ఆమెకు పెన్షన్ ఇవ్వలేదు. అధికారులందరినీ కలిసి పరిస్థితులను వివరించాక మూడు నెలల క్రితం నుండి ఇస్తున్నారు. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిని నేను ఎలా పోషించుకోవాలి.? గతంలో రేషన్ బియ్యమే తినేవాళ్లం..ఇప్పుడు కేజీ రూ.50 పెట్టి కొనుక్కుంటున్నాం.

విలీనం చేస్తానని మాటతప్పారు -ఎన్.మహేష్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు

2001 నుండి ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పొద్దుటూరులో పని చేస్తున్నా. గతంలో పాదయాత్రలో జగన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తానని పాదయాత్రలో మాటిచ్చారు. దీన్ని నమ్మి నాలాంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఓట్లేశారు. కానీ ఆ హామీని అమలుచేయలేదు. రూ.18 వేల జీతంతో కుటుంబాన్ని పోషించుకోవాలంటే కష్టంగా ఉంది. ఇద్దరు పిల్లలకు కలిపి స్కూలు ఫీజులు యేడాదికి రూ.45 వేలు అవుతున్నాయి. ఈ యేడాది ఇంకా స్కూలు ఫీజులు పెంచుతున్నారు. కనీసం అమ్మఒడి కూడా మాకు రాదు.

బిసి కార్పొరేషన్ రుణాలు లేవు -ఎం. రాజు, టెక్స్ టైల్ వ్యాపారి

20 ఏళ్లుగా టెక్స్ టైల్ బిజినెస్ చేస్తున్నా. షాపులు పెట్టుకోవడానికి గతంలో బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు వచ్చాయి. ఇప్పుడు రుణాలు అందడం లేదు. దీంతో చిన్న షాపు పెట్టుకోవాలన్నా కనీసం రూ.3 లక్షలు అవుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న టెక్స్ టైల్ పార్కు కూడా వినియోగంలో లేదు. టెక్స్ టైల్ పార్కు వినియోగంలోకి వస్తే రకరకాల వస్త్ర వ్యాపారులు ఉత్పత్తులను ప్రదర్శనగా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. లోకల్ గా తయారు చేసిన ఉత్పత్తులకు సేల్స్ పెరుగుతాయి.

నాలుగేళ్లుగా సమస్యలపై నోరు మెదపడంలేదు -పొట్టిబాబు, కాంట్రాక్టు ఉద్యోగి, ఆర్.టీ.పీ.సీ

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ లో 18 ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగిగా సేవలందిస్తున్నా. మరో ఎనిమిది ఏళ్లలో రిటైర్డ్ అవుతా. కనీసం ఇప్పటి వరకు మాకు కనీసం రిటైర్ మెంట్ అయ్యాక ఏం కల్పిస్తారో కూడా చెప్పలేదు. పాదయాత్ర సమయంలో మాతో జగన్ సమావేశమై మీరు కష్టపడండి మీ జీవితాల్ని నేను చూసుకుంటా అన్నారు. కానీ నాలుగేళ్లుగా మా వైపు కన్నెత్తి చూడలేదు. రిటైర్మెంట్ అయ్యేవారికి కొంత నిధిని కేటాయిస్తే బాగుంటుంది. 60 ఏళ్ల వయసులో మరో పనికి వెళ్లాలంటే వెళ్లలేము. మా ఎమ్మెల్యే రాచమల్లుతోనూ చర్చించాం..అయినా మా సమస్యకు పరిష్కారం దొరకలేదు.

వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలూ బాధితులే మరోసారి అధికారమిస్తే ఇళ్లలోకి వచ్చి దోచేస్తారు అధికారంలోకి వచ్చాక అడ్వకేట్లకు ప్రత్యేక రక్షణ చట్టం వైసీపీ వేసిన అడ్డగోలు పన్నులు తగ్గిస్తాం పాత ఫీరీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమల్లోకి తెస్తాం  ప్రముఖులతో ముఖాముఖిలో యువనేత లోకేష్

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో వివిధరంగాల ప్రముఖులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… ఉమ్మడి కడప జిల్లా లో 10 కి 10 సీట్లు ఇస్తే వైసీపీ చేసింది ఏంటి?.  ప్రస్తుతానికి షాపులు, వ్యాపారాల మీద దాడి చేస్తున్నారు. మరోసారి ఓటేస్తే వైసీపీ అండ్ కో ఇళ్లలోకి వకచ్చి దోచుకుంటారు.  ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉండాలి అంటే TDP  జెండా ఎగరాలి.

కప్పంకట్టలేక వ్యాపారుల ఇక్కట్లు

వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు కప్పం కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క చెత్త పన్ను, బోర్డు పన్ను, కరెంట్ బిల్లులు పేరుతో భారీగా జే ట్యాక్స్ కడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీపెంచిన అడ్డగోలు పన్నులు తగ్గిస్తాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చాం. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి వ్యాపారాలు తక్కువ ఖర్చుతో నిర్వహించే విధంగా ప్రోత్సహిస్తాం. వెయ్యి, రెండు వేల నోట్లు రద్దు చెయ్యాలని చెప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబు గారు. బాబు గారు వచ్చిన వెంటనే అక్రమార్కులు ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతారు.

వైసీపీ వేధింపులతో కంపెనీలు పరార్

 టిడిపి హయాంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించాం అని వైసిపి ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇప్పుడు కోడి గుడ్డు మంత్రి రాష్ట్ర పరువు తీస్తున్నాడు. వైసీపీ వేధింపుల వలన అన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాయి. టిడిపి హయాంలో అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించాం. రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చాం, విశాఖకు ఐటి కంపెనీలు తీసుకొచ్చాం. జగన్ వేదింపులు, జే ట్యాక్స్ కట్టలేక కంపెనీలు అన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. అమర్ రాజా, ఫాక్స్ కాన్, రిలయన్స్ లాంటి సంస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్లి పోయాయి.

వైసీపీ విధానాలు విద్యార్థుల పాలిట శాపం

వైసీపీ వచ్చిన తరువాత విద్యా వ్యవస్థను నాశనం చేసారు . టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టి సెక్యూరిటీ గార్డుల్లా ట్రీట్ చేశారు. ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని భ్రష్టు పట్టించాడు. విద్యా దీవెన, వసతి దీవెన అనే చెత్త కార్యక్రమాలు తీసుకొచ్చాడు. డబ్బులు పడక, సర్టిఫికేట్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ కొత్త విధానాలు తల్లిదండ్రులు, విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. కేజీ టూ పీజీ వరకూ పాఠ్యాంశాలు పూర్తిగా మారుస్తాం. విద్య పూర్తి చేసే సరికి ఉద్యోగాలు చెయ్యడానికి సిద్దంగా ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం.విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. టీచర్లపై ఎటువంటి వేధింపులు ఉండవు, యాప్ ల పేరుతో పెట్టిన భారం లేకుండా చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత టీచర్లు కేవలం పాఠాలు చెప్పే పని తప్ప ఇతర పనులతో వేధింపులు ఉండవు.

న్యాయవిభాగానికి మేం నిధులిస్తే ఆపేశారు!

టిడిపి హయాంలో న్యాయ విభాగానికి నిధులు కేటాయించి కొత్త భవనాలు, లైబ్రరీలు కట్టించడానికి పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసింది.. అందులో భాగంగా వైజాగ్ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టుల్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమైంది. ఆ రోజే నిర్ణయించుకున్నా… న్యాయ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాం. మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. కొత్త భవనాలు, జూనియర్ లాయర్ల కోసం కోర్టులోనే లైబ్రరీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తాం. అడ్వకేట్లకు ప్రత్యేక ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకురావడం పై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అడ్వకేట్లకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తాం. ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం.

ఫైబర్ గ్రిడ్ ను చంపేశారు!

టిడిపి హయాంలో తీసుకొచ్చిన ఫైబర్ గ్రిడ్ ని వైసీపీ చంపేశాడు. తక్కువ ధరకే హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తే ప్రజలకు మేలు, వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చు అని చంద్రబాబు గారు ఫైబర్ గ్రిడ్ డిజైన్ చేశారు. ఫైబర్ గ్రిడ్ పథకాన్ని చంపడానికి నాపై అనేక ఆరోపణలు చేశారు. ఫైబర్ గ్రిడ్ దగ్గర నుండి స్కిల్ డెవలప్మెంట్ వరకూ అనేక ఆరోపణలు చేశారు. ఒక్కటి కూడా నిరుపించలేకపోయారు. ఎవరూ అడగకపోయినా ఆస్తులు ప్రకటించిన కుటుంబం మాది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చౌకగా హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాం.

పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తాం

పర్యాటక రంగం లో ఏపికి అనేక అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఎకో టూరిజం ఏర్పాటు ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తీర ప్రాంతాన్ని, ఏకో టూరిజం, టైగర్ ఎకో టూరిజం అభివృద్ది చేస్తాం. ధనవంతులకు, పేదలకు మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తాం.

ముఖాముఖి సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

కొత్తపల్లి విడిది కేంద్రం వద్ద వివిధ రంగాల నిపుణులతో నిర్వహించిన సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అడ్వకేట్ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ… కోర్టుల్లో మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం, కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. ఐటి ఉద్యోగి కొండయ్య మాట్లాడుతూ… వైసీపీ  పాలనలో ఒక్క ఐటి కంపెనీ కూడా రాకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.  నవీన్ మాట్లాడుతూ… కడపలో పర్యాటక రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని చెప్పారు. అడ్వకేట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… అడ్వకేట్ల కు హెల్త్ స్కీం అనేది లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. మరో అడ్వకేట్ ప్రకాష్ మాట్లాడుతూ…ఇంటి స్థలాలు, ఇళ్లు లేక అడ్వకేట్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. విద్యార్థి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తేసారు, ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధిస్తుంది. ప్రభుత్వ విధానాల వలన నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. వ్యాపారి రాము మాట్లాడుతూ… ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. దొంగ నోట్లు ఎక్కువుగా చలామణి అవుతున్నాయని అన్నారు.  లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ… వైసిపి ప్రభుత్వం వచ్చాక ఏపి ఫైబర్ ను నాశనం చేశారు. టిడిపి హయాంలో 10 లక్షల కనెక్షన్లు ఉంటే ఇప్పుడు కేవలం 4 లక్షల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయన్నారు. అడ్వకేట్ క్లర్క్ వరదరాజులు మాట్లాడుతూ… పేద అడ్వకేట్లు, అడ్వకేట్ గుమాస్తాలను ఆదుకోవడానికి ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చెయ్యాలని కోరారు.

యువనేతను కలిసిన నాగులపల్లె గ్రామస్తులు

మైదుకూరు నియోజకవర్గం నాగులపల్లె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మైదుకూరు వయా పొద్దుటూరు రోడ్డు నుంచి నాగులపల్లె వెళ్లే రహదారి 3 కి.మీ. అధ్వాన్నంగా తయారైంది. ఈ రహదారిలో ఉన్న నాగులపల్లె, ఖాదర్ పల్లె గ్రామాల్లో 4వేల జనాభా ఉన్నాం. వైసిపి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఈ రోడ్డుని డబుల్ రోడ్డుగా విస్తరించి మా ఇబ్బందులను పరిష్కరించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇదివరకెన్నడూ లేనివిధంగా రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి, ఆయన సామంతరాజులకు దర్శనమిస్తున్నా తట్టమట్ట పోసే దిక్కులేదు. దివాలాకోరు పాలన చూసి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని దాచుకోవడం, దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ రోడ్లపై లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నిలువెత్తు గోతులు గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ సిసి రోడ్లు, లింకురోడ్లు నిర్మించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగులాపల్లి రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరిస్తాం.

యువనేతను కలిసిన ఖాదర్ పల్లె గ్రామస్తులు

మైదుకూరు నియోజకవర్గం ఖాదర్ పల్లె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. కెసి కెనాల్ చాపాడు మెయిన్ చానల్ నెం.1 ఆయకట్టు చివరలో చాపాడు, ఖాదర్ పల్లె గ్రామపొలాలు ఉన్నాయి. చానల్ -1 అడ్డకాల్వ నుంచి వెళ్లే చెరువు కింద ఖాదర్ పల్లె కు చెందిన 1200ఎకరాల పొలాలు ఉన్నాయి. కాల్వ ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో చెరువుకు నీరందక ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల ఆయకట్టు చివరి భూముల రైతులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నీటికయ్యలు తీసుకొని నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. మా గ్రామానికి సమీపంలో ఉన్న కుందూనది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు నీరందించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ.11వేల కోట్లు ఖర్చుచేస్తే, గత నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం ఖర్చుపెట్టింది కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే. కుందూనది పక్కనే ఉన్నా ఖాదర్ పల్లి గ్రామరైతులు సాగునీటి ఇబ్బంది ఎదర్కోవడం దురదృష్టకరం. కుందూనది నుంచి ఖాదర్ పల్లె చెరువులకు నీరందించే అవకాశాలను పరిశీలించి, ఇక్కడి రైతులకు నీరందించేలా చర్యలు తీసుకుంటాం.

లోకేష్ ను కలిసిన సీతారాంపురం రైతులు

మైదుకూరు నియోజకవర్గం సీతారాంపురం రైతులు యువనేత లోకేష్ ను కలసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామపొలాలకు కుందూనది నుంచి సాగునీరు అందుతోంది. కుందూనది విస్తరణ పేరుతో ప్రభుత్వం ఒక ప్రముఖ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వగా, కొందరు స్థానిక వైసిపి నేతలు సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. స్థానిక నేతలు నదివెంట ఉన్న మట్టి, ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. నది వెంట ఉన్న రైతుల విద్యుత్ మోటార్లు, పైప్ లైన్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు కొనసాగుతున్నప్పటికీ మట్టి, ఇసుక తవ్వకాలు ఆపడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ రైతులకు న్యాయం చేయండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

ఇసుక, మట్టి అమ్మకాలపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదు. గత నాలుగేళ్లలో బినామీ సంస్థను అడ్డంపెట్టుకొని ఇసుకద్వారా  వైసీపీ రూ.10వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. రైతుల పక్షాన నిలవాల్సిన అధికారులు వైసిపి తొత్తులుగా మారడం దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ సీతారాంపురం రైతులకు అండగా నిలస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చాక రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం.

లోకేష్ ను కలిసిన చియ్యపాడు గ్రామ దళితులు

మైదుకూరు నియోజకవర్గం చియ్యపాడు గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా కాలనీలో సుమారు 250 కుటుంబాలున్నాయి. తరతరాలుగా మేం ఇమాందార్లు, మేటిదార్లుగా పనిచేస్తున్నాం. మాకు చెందిన భూములు  కొందరు అధికారపార్టీ వారి ఆక్రమణలో ఉన్నాయి. దొంగతనంగా ఆ భూములకు పట్టాదారు పుస్తకాలు తెచ్చుకుని అనుభవిస్తున్నారు. సర్వే నంబర్ 598, 600, 10.20, 6.80 ల్లో మా భూములు కొన్ని ఉన్నాయి. వాటిని మేం పంచుకోలేక, నీరులేక పంటలు వేయలేకపోవడంతో భూములు బీడుగా మారాయి. భూములను బాగుచేసుకునేందుకు కలెక్టర్లు, అధికారులు మాకు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదు. సర్వే నంబర్లు 598, 600ఎం.2.0 భూముల్లో కొంత మంది పోలీసులను అడ్డుపెట్టి ప్లాట్లు వేసుకున్నారు. కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కలెక్టర్ మా భూమిని ప్రభుత్వ భూమి అని, ఇళ్ల పట్టాలు ఇస్తామని చెబుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా భూములను మాకు ఇప్పించి న్యాయం చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వారిపైనే ఉక్కుపాదం మోపుతూ తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు.  జగన్ అధికారంలోకి వచ్చాక దళితులకు చెందిన 12వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గత నాలుగేళ్లలో దళితుల వద్ద ఉన్న భూమి విస్తీర్ణం తగ్గిపోయింది. ఎస్సీలకు చెందాల్సిన సబ్ ప్లాన్ నిధులు రూ.28,147కోట్లు దారిమళ్లించారు. దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. వైసీపీ పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు, భూములకు రక్షణ కరువైంది. టిడిపి అధికారంలోకి వచ్చాక చియ్యపాడు దళితులకు చెందిన భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని సొంతదారులకు అప్పగిస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన విశ్వనాథపురం రైతులు

మైదుకూరు నియోజకవర్గం విశ్వనాథపురం గ్రామ రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.  మా గ్రామ పొలాలకు కెసి కెనాల్ ద్వారా సాగునీరు అందుతోంది. వరి, పసుపు, శనగ పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాం. పసుపుపంట వేయడానికి ఎకరాకు రూ.1.30లక్షలు ఖర్చవుతోంది. అయితే గత కొంతకాలంగా పసుపుకు గిట్టుబాటు ధర రావడంలేదు. గతంలో క్వింటాలుకు రూ.8500 వరకు ధర లభించేది. వైసిపి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక క్వింటాకు రూ.5,500 కి మించి ధర లభించడం లేదు. గత మూడేళ్లుగా పసుపు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేదు. పంటను అమ్ముకోవడానికి మేము కడప, దుగ్గిరాల లేదా మహారాష్ట్రలోని శాంగ్లీ మార్కెట్ కు వెళ్లాల్సి వస్తోంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా ప్రాంతంలో శాశ్వత పసుపు మార్కెట్ ఏర్పాటుచేసి, మద్దతు ధర కల్పించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగం పూర్తిగా నిర్వీర్యమైంది. ఎన్నికల సమయంలో రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్న ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదు. జగన్ నిర్వాకం కారణంగా ఎపి రైతుల్లో అప్పుల్లో దేశం మొత్తమ్మీద మొదటిస్థానంలో ఉన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే అన్నిరకాల పంటలకు గిట్టుబటు ధర కల్పిస్తాం. విశ్వనాథపురంలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేస్తాం. ఇక్కడ పంటనుబట్టి శాశ్వత మార్కెట్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తాం.

Also Read This Blog: Uniting Youth Voices: The Yuvagalam Padayatra for Social Justice

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *